Friday, December 18, 2009

 

సింగి...నాదం...

(ఇవన్నీ ఈనాడు దినపత్రిక తమిళనాడు ఎడిషన్ కోసం 2009 డిసెంబర్ - 2010 జనవరి సంగీతోత్సవాల నిమిత్తం పంపిన నా జోకులు... ఆనందించండి.)

1."ఏదో జలతరంగం కచేరీ అని అందరికీ చెప్పి ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రప్పించారేంటీ...?" సభ సెక్రెట్రీని కోపంగా అడిగాడు ఒకాయన.
"అదిగోండి సార్... మా విద్వాంసుడు ఆ స్విమ్మింగ్ ఫూల్ జలంలో ఈదుతూ పెద్ద పెద్ద తరంగాలు సృష్టిస్తున్నారు కదా... ఇంకేం కావాలి?" అని చికాగ్గా చెప్పాడు సెక్రెట్రీ.
-------------------------------------------
2."ఆ మృదంగం కళాకారుడు అంత వయ్యారాలు పోతూ వాయిస్తున్నాడేంటీ?" కచేరీలో ఒక శ్రోత మరొక శ్రోతను అడిగాడు.
"ఆయన సొగసుగా మృదంగ తాళం వాయిస్తుంటాడట..." అని పక్క శ్రోతనుంచి బదులు వచ్చింది.
-----------------------------------------
3."నీకసలు సరళీ స్వరాలే తెలియదంటున్నావు. మరి ఈ పోటీకి ఎలా వచ్చావు ?" అని పోటీదారుణ్ణి అడిగాడు నిర్వాహకుడు...
"నాకు అనురాగం, కూనిరాగాలు బాగా వచ్చండీ. అవే ప్రదర్శిస్తాను..." అని బదులిచ్చాడు పోటీకొచ్చినాయన.
-----------------------------------------
4."ఆ విద్వాంసుడి వెంట తప్పనిసరిగా ఆయన భార్య వస్తుంటుంది. ఆవిడకు కూడా సంగీతం బాగా వచ్చా ?" అని ఒకాయనకు సందేహం వచ్చి మరో సంగీత ప్రియుణ్ణి అడిగాడు.
"అదేం కాదు, అయనకు 'ఎంత నేర్చినా....' అనే కీర్తన బాగా ఇష్టం. అందులో 'ఎంతవారలైనా కాంతా దాసులే' అంటూ నెరవు చెయ్యకుండా ఆపడానికి ఆవిడ ఈయన్ని కనిపెట్టుకుని ఉంటుంది." అని ఆ సంగీత ప్రియుడు అనుమానం నివృత్తి చేశాడు.
-----------------------------------------
5."అదేం మృదంగ వాదన బాబూ... ఇక్కడందరికీ మరణవేదన అనుభవిస్తున్నట్లుంది... చెవుల్లోంచి రక్తం కారుతోంది కాస్తా తగ్గవయ్యా... అని కచేరీలో మృదంగం వాయిస్తున్న కళాకారుడితో అన్నాడొక శ్రోత.
ఇది "మరణ మృదంగ"మండీ... అని మృదంగం కళాకారుడి నుంచి బదులు వచ్చింది.
----------------------------------------
6."ఆ గాయకుడు 'ఆ.....' అంటూ గంట సేపటి నుంచీ ఆ..కారంతోనే ఆలాపన చేస్తున్నాడు. ఇంకేమీ స్వర సంచారం చెయ్యడా ?" అని ఒక శ్రోతకు సందేహం వచ్చింది.
"అది ఆ...కారం కాదు... 'హా హా కారం' పక్కనున్న వయొలిన్ కళాకారుడు తన వయొలిన్ కమానుతో పొడుస్తున్నాడు... అదీ ఆయన బాధ" అని మరొకాయన సందేహం తీర్చాడు.
-----------------------------------------
7."ఎందరో గొప్ప విద్వాంసులున్నాగానీ, ఆయన కచేరీకి మాత్రం అంత ఎక్కువ కలెక్షన్ రావడానికి కారణమేంటి ?" అని మరో సంగీతవేత్తకు గొప్ప అనుమానం వచ్చింది.
"ఆ విద్వాంసుడు హాల్లోకి అందర్నీ ఫ్రీగా రానిచ్చి.... తలుపులు మూయిస్తాడు. తర్వాత ఎవరైనా బయటకు వెళ్ళలనుకుంటే డబ్బులిచ్చి తలుపులు తీయించుకోవాలి. ఎంత తొందరగా వెళ్ళిపోవాలనుకుంటే ఎక్కువ చెల్లించుకోవాలి." అని మరొకాయన గుట్టు విప్పాడు.
-------------------------------------------
8."ఆ కళాకారుడు గాలిలోకి చూస్తూ వాయిస్తుంటాడేంటీ ?" అని పెద్ద సందేహం వచ్చింది ఒక రసికుడికి.
"ఆయన వాయించేది వాయులీనం (వయొలిన్) కదా... అందుకని అనంతవాయువుల్లో లీనమైపోయేంతగా గాల్లోకి చూస్తూ వాయిస్తుంటాడు" అని మరొకరు సందేహ నివృత్తి చేశారు.
-------------------------------------------
9. "ఇదేం కచేరీ బాబూ... ఏదో కర్ణాటక, హిందుస్తానీ, వెస్ట్రన్ సంగీతాల ఫ్యూజన్ కచేరీ అని చెప్పారు... అందరూ అంత కన్ఫ్యూజన్‌గా వాయిస్తున్నారేంటీ ?" జనం గగ్గొలు పెట్టారు.
"క్షమించండి... ప్రాక్టీస్ టైం లేక, కళాకారులంతా ఫ్లయిట్ దిగి నేరుగా కచేరీకి వచ్చేశారు. అందుకే ఫ్యూజన్... కన్ఫ్యూజన్ అయ్యింది" అని జవాబిచ్చుకున్నాడు సెక్రెట్రీ...
-------------------------------------------
10. "తెర తీయగరాదా.... " అని త్యాగరాజ కీర్తనతో కచేరీ ప్రారంభించాడు విద్వాంసుడు...
"తీశాను కదా సార్... ఇంకే తెర తీయాలి ? " అని అరిచాడు స్టేజి అసిస్టెంట్...
-------------------------------------------
11. ఆ ఇంట్లో పెళ్ళి కుదిరింది...
భార్య : ఏమండోయ్ అమ్మాయి పెళ్ళి ఆభరణాల పని పూర్తయిందా ?
భర్త : అన్నీ నిన్ననే ఇంటికి తెచ్చానుగా ఇంకేం కావాలి ?
భార్య : ఆభరణాలన్నీ ఉన్నాయిగానీ, అందులో శంకరాభరణం లేదు.
-------------------------------------------
12. "మీ అమ్మాయికి 'నీలాంబరి' అని నీకిష్టమైన సంగీత రాగం పేరు పెట్టారు కదా... మరి సంగీతం బాగా పాడుతోందా ?" అని పక్కింటావిడను అడిగింది పంకజాక్షి.
"సంగీతం మాట దేవుడెరుగు ? 'నరసింహ' సినిమాలో 'నీలాంబరి' లాగా గదిలో తలుపులేసుకుని రజనీకాంత్‌నే పెళ్ళి చేసుకుంటానని మొండికేస్తోంది..." అని ఆ పక్కింటావిడ తన బాధ చెప్పుకుంది.
-------------------------------------------
13. సంగీత సభ మొదలైది.... విద్వాంసులంతా కిరీటాలు, తలపాగాలు, రాజ దుస్తుల్లో వచ్చి కచేరీ మొదలుపెట్టారు.
"ఇదేంటీ... పంచెలు, శాలువాలు మానేసి... రాజదర్బార్‌లో ఉన్నట్టు విద్వాంసులంతా కిరీటాలు, తలపాగాలు, రాజ దుస్తుల్లో కనిపిస్తున్నారు? " అని ప్రేక్షకదేవుడు ఒకరికి సందేహం వచ్చింది.
"మరేం లేదండీ... ఈ రోజు వాళ్ళు 'దర్బారీ కానడ' రాగంలోనే ఆలాపన, కీర్తనలు వినిపిస్తార్ట... సహజత్వం కోసమే ఇలా వచ్చారు" అని సభ సెక్రెట్రీగారు సెలవిచ్చారు.
-------------------------------------------
14. కచేరీ చాలా వరకూ పూర్తయింది. ఆ సమయంలో ఔత్సాహిక సంగీత ప్రియుడొకరు టిక్కెట్టు కొనుక్కుని లోపలికెళ్ళాడు.
అలా లోపలికెళ్ళగానే విద్వాంసుని నోట "తం తాం తం తాం" అనే జతి వినిపించింది. ఆలస్యంగా వచ్చినందుకు తనను తంతానని విద్వాంసుడు తిడుతున్నాడనుకున్నాడు ఈ ఔత్సాహిక సంగీతప్రియుడు. భయపడి బయటకు పరిగెత్తుకు వచ్చి, అక్కడే ఉన్న సీనియర్ సంగీత విద్వాంసుడొకరితో తన బాధ చెప్పుకున్నాడు. ఆయన కూడా వచ్చి విన్నాడు...
"భయపడకండి... అది తనియావర్తనంలో వచ్చే కొనక్కోల్. అందులోజతులు ఇలాగే వస్తుంటాయి. మిమ్మల్ని తంతాననడంలేదు" అని ఊరడించి లోపలికి పంపాడు.
-------------------------------------------
15. "ఇంతకు ముందు సంగీత విద్వాంసుడవ్వాలని సంగీతం నేర్చుకున్నావు కదా... ఇప్పుడేం చేస్తున్నావు" అని తన మిత్రుణ్ణి అడిగాడు ఒకాయన.
"నేర్చుకున్నాను కానీ, కచేరీలు పెద్దగా లేకపోవడంతో... ఇళ్ళు, దుకాణాలు, ఫ్లాట్లలో అద్దెకుండే వారిని ఖాళీ చేయించడం కోసం వాటి యజమానులు నన్ను పిలిపించుకుని ఆ పక్కనే కచేరీలు చేయించి ఇంతో అంతో ముట్టజెబుతున్నారు. నాకు ఇదే బాగుంది" అని ఆనందంగా మిత్రుడినుంచి బదులు వచ్చింది.

Comments:
nice
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support https://www.youtube.com/garamchai
 
Post a Comment



<< Home

This page is powered by Blogger. Isn't yours?